: తమిళ రాజకీయాలను అందరిలాగే నేనూ ఆసక్తిగా చూస్తున్నా!: రోశయ్య
తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య తన దైన శైలిలో స్పందించారు. తమిళ రాజకీయాల పట్ల అందరిలాగే ఆసక్తిగా చూస్తున్నానని, శశికళకు రాజకీయ అనుభవం లేకున్నా, ఇన్నాళ్లూ జయలలిత వెనుకే ఉండి అన్నీ గమనించారని, పన్నీరు సెల్వం పట్ల ప్రజల్లో సానుభూతి ఉందని, విధేయుడు అనే పేరు సెల్వంకు ఉందని అన్నారు.
తమిళనాడు ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని తాను భావిస్తున్నానని అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం ఉన్నట్లు తాను ఇంకా తెలుసుకోలేదని, ఈ పరిస్థితుల్లో తమిళనాడులో ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అవకాశం లేదని, డీఎంకేకు కొంత మేర లబ్ధి పొందుతుందని రోశయ్య అభిప్రాయపడ్డారు.