: ఐదువందల మంది శక్తిమంతుల జాబితాలో మన్మోహన్, సోనియా
రెండుసార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన అధినేత్రి సోనియాగాంధీ, అదే ప్రభుత్వానికి రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతుల జాబాతాలో నిలిచారు. ప్రతిష్ఠాత్మక 'విదేశీ పాలసీ పత్రిక' తాజాగా 500 మందితో రూపొందించిన జాబితా విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన 16 మంది ఉన్నారు. వారిలో రాజకీయ రంగానికి చెందిన ఆర్ధిక మంత్రి పి.చిదంబరం, రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, బీజేపీ నేత సుష్మా స్వరాజ్, భారతీయ ఆధ్యాత్మిక గురువు బాబా రామ్ దేవ్, రవిశంకర్ కూడా ఉన్నారు.
అలాగే, భారతదేశ 'రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్' (రా) అధికారి అలోక్ జోషి, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ కూడా ఈ లిస్టులో వున్నారు. వీరేకాక భారతీయ పారిశ్రామిక వేత్తలయిన రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ, లక్ష్మీ మిట్టల్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలీ దీక్షిత్, మెడిసన్స్ సాన్స్ ప్రాంటియర్ అధ్యక్షుడు ఉన్ని కరుణాకర, ముంబయి మేయర్ సునీల్ ప్రభు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యదర్శి సలీల్ శెట్టి కూడా ఉన్నారు.
వీరితో పాటు పాకిస్థాన్ నుంచి ఆర్మీ చీఫ్ అష్ఫాక్ పర్వేజ్ కయాని, ఐఎస్ఐ చీఫ్ జహీర్ ఉల్-ఇస్లామ్, పాక్ తాలిబాన్ నేత హకీముల్లా మెషుద్, కరాచీ అడ్మినిస్ట్రేటర్ సయద్ హషిమ్ రాజ జైది ఈ జాబితాలో ఉన్నారు. చైనా నుంచి దాదాపు 30 మంది ఈ జాబితాలో ఉండగా.. టిబెటిన్ ల ఆధ్యాత్మిక గురువు దలైలామా కూడా వారిలో ఒకరు. భూమిపై ఉన్న 14 మిలియన్ల మందిలో పలు రంగాలకు చెందిన వారిని గుర్తించడం అత్యంత కష్టమని పత్రిక తెలిపింది.