: తన కక్కుర్తితో విదేశాల్లో ఎయిర్ ఇండియా పరువు తీస్తున్న ఉద్యోగులు!


భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో పని చేస్తున్న ఉద్యోగులు, విధి నిర్వహణలో భాగంగా విదేశాలకు వెళ్లినప్పుడు సంస్థ పరువు తీస్తున్నారు. బఫే టేబుల్ పై ఉంచిన ఆహార పదార్థాలను, తమ కక్కుర్తితో బాక్సుల్లో సర్దుకుని ఫ్లయిట్ అటెండెంట్లు తీసుకెళుతున్నారని, బఫే అంటే అక్కడే తినాలి తప్ప బయటకు తీసుకెళ్లేది కాదని, లండన్ లోని ఓ ప్రముఖ హోటల్ నుంచి ఎయిర్ ఇండియా యాజమాన్యానికి ఫిర్యాదు అందింది. సదరు హోటల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఈ నోటీసులను పంపగా, ఎయిర్ ఇండియా స్పందిస్తూ, ఉద్యోగులకు గడ్డి పెట్టింది.

లండన్ లోని ఓ హోటల్ నుంచి దురదృష్టకరమైన ఈ-మెయిల్ వచ్చిందని, దీనిలోని వివరాల ప్రకారం, అందరూ కాకపోయినా, కొంతమంది కక్కుర్తితో, హోటల్ ఆహార పదార్థాలను తీసుకెళుతున్నారని, ఇలా చేసి సంస్థకున్న పరువును మంటగలపొద్దని పేర్కొంది. కాగా, ఈ విషయంలో ఉద్యోగులు మరో విధంగా స్పందించారు. తాము 14 నుంచి 15 గంటలు ప్రయాణించి లండన్ చేరుకుంటామని, బాగా అలసిపోయిన వేళ, రూములో కాసేపు సేదదీరి తినవచ్చన్న ఉద్దేశంతో ఒకరిద్దరు బాక్సులు తెచ్చుకుని వాటిల్లో ఆహారాన్ని తీసుకెళతారని, అదేం తప్పని కేబిన్ క్రూ ఉద్యోగులు ప్రశ్నించారు. లండన్ వంటి చోట్ల విశ్రాంతికి కేవలం రూము మాత్రమే ఇచ్చి, సర్వీస్ కోసం తమ నుంచే అదనంగా వసూలు చేస్తారని, రెగ్యులర్ సిబ్బందితో పోలిస్తే 60 శాతం వరకూ తక్కువ వేతనాలు అందుకునే కాంట్రాక్టు ఉద్యోగులు వాటిని భరించలేరని చెప్పారు. అక్కడి రూమ్ మెనూల్లో ఇండియన్ ఫుడ్ తక్కువని, భోజనంలో భాగంగా శాండ్ విచ్ వంటివి తినలేకనే, బాక్సులు తెచ్చుకుంటారని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News