: శాండ్ విచ్ ఖరీదు 1500/-...డబ్బుల్లేక ద్రవిడ్ టీం ఇబ్బందులు
టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడమంటే జీవితం మారిపోయినట్టే... ఆటగాళ్లకు బోర్డు భారీ ఎత్తున చెల్లిస్తుందని, అద్భుతమైన సౌకర్యాలు అందజేస్తుందని తెలిసిందే. అయితే టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సారధ్యంలోని భారత్ అండర్-19 జట్టు మాత్రం తిండికి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతోంది. ముంబైలోని ఖరీదైన హోటల్ లో బస ఏర్పాట్లు చేసిన బీసీసీఐ ఆటగాళ్ల అలవెన్సులు చెల్లించడం లేదు. లోధా టీం సంస్కరణలు అమలు చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బీసీసీఐ కోశాధికారి అజయ్ షిర్కే రాజీనామా చేయకతప్పలేదు. దీంతో అండర్ 19 జట్టుకు నిధులు విడుదల చేస్తూ సంతకాలు చేసే అధికారి అందుబాటులో లేడు.
ఈ నేపథ్యంలో అండర్ 19 ఆటగాళ్ల రోజువారీ అలవెన్సు 6800 రూపాయలు విడుదల చేసే నాధుడు లేక ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆటగాడు మాట్లాడుతూ, తమను ఖరీదైన హోటల్ లో ఉంచారని, అక్కడ ఒక శాండ్ విచ్ ఖరీదు 1500 రూపాయలని చెప్పాడు. అలాంటి హోటల్ లో తినాలంటే చాలా కష్టమని భావించి, తామంతా హోటల్ బయట భోజనం చేసేందుకు వెళ్తున్నామని తెలిపాడు. టీమిండియాకు ఆర్ధిక ఇబ్బందులు లేకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీ హైదరాబాదులో ఉన్న జట్టుకు అన్ని చెల్లింపులు సక్రమంగా చేస్తున్నారు.