: శశికళ మీటింగ్ సరే... మరి పన్నీర్ సెల్వం వ్యూహమేంటి?


తమిళనాట అధికారం కోసం అర్రులు చాస్తున్న శశికళా నటరాజన్ ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి 130 మంది ఎమ్మెల్యేలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో కనిపించిన ఎమ్మెల్యేలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత మరణం తరువాత పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్నార్ గుడి మాఫియాగా పేరొందిన శశికళ వర్గం అధికారం కోసం పావులు కదుపుతుందని కూడా అక్కడి నేతలకు తెలిసిందే. అదే సమయంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో శశికళ వర్గం బలంగా ఉందన్న సంకేతాలు పార్టీ నేతలు, ప్రజల్లోకి పంపారు.

 ఈ క్రమంలో పన్నీర్ సెల్వం జయలలిత సమాధి వద్ద మౌన దీక్ష చేయడం, తిరుగుబాటు చేయడంతో అప్రమత్తమైన శశికళ వర్గం ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లింది. అధికారం చేజారిపోకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అమ్మకు నమ్మిన బంటుకు, ఆమె ఆప్తురాలికి మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రత్యక్ష ఆరోపణలు చేసుకోకుండా రెండు వర్గాలు తమిళ ప్రజల మద్దతు కోసం సానుభూతి వాక్కులు మాత్రమే పలుకుతున్నారు. తీవ్ర విమర్శల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో శశికళ ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరు కావడం మరింత ఆసక్తి రేపుతోంది. రాజకీయాలు కేవలం శశికళ, పన్నీర్ సెల్వం సొత్తు మాత్రమే కాదని వారు కూడా నిరూపించారు.

శశికళ సమావేశం ఏర్పాటు చేయడంతో వారంతా ఆ సమావేశానికి హాజరయ్యారు. పన్నీర్ సెల్వం సమావేశం ఏర్పాటు చేయలేదు. అలా చేస్తే ఆయనకు ఎంత మంది మద్దతిస్తున్నారన్న సంగతి శశికళ వర్గానికి తెలిసిపోతుంది. అలా జరగకుండా ఆయన జాగ్రత్తపడ్డారు. సమావేశానికి ఎమ్మెల్యేలంతా వెళ్లడంతో మన్నార్ గుడి మాఫియా వ్యూహమేంటన్నది పన్నీర్ సెల్వం సులువుగానే తెలుసుకోగలరు. దీంతో ఆ వ్యూహాలకు దీటుగా వ్యూహాలు రచించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ, డీఎంకే వంటి పార్టీలతో ఆయన సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. అవసరమైతే వారి సహాయం తీసుకునేందుకు కూడా ఆయన వెనుకాడకపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు సస్పెన్స్ ధ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News