: తమిళనాట పెను సంచలనం.. శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు.. వేడెక్కిన రాజకీయాలు


తమిళ రాజకీయాల్లో మరో పెను సంచలనం. రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించని ఘటన. ‘అమ్మ’కు నమ్మినబంటు అయిన పన్నీర్  సెల్వం మంగళవారం రాత్రి ఒక్కసారిగా ‘చిన్నమ్మ’పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలనుకున్న శశికళకు షాకిచ్చారు. ప్రజలు కోరుకుంటే తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు.

గతరాత్రి 9 గంటల వేళ జయలలిత సమాధి వద్ద అంజలి ఘటించిన ఆయన దాదాపు 45 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయారు. అనంతరం కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చి విలేకరులతో  మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ‘అమ్మ’ చెప్పిందటూ పలు విషయాలు వెల్లడించారు.  శశికళ వర్గం వారు తనతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు.

‘నా అంతరాత్మ వేదనతో రగిలిపోతోంది’.. అని మొదలుపెట్టిన పన్నీర్ సెల్వం దేశ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. తనకు జరగకూడనిది ఏదైనా జరిగితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాలని ‘అమ్మ’ తన చేతులు పట్టుకుని మరీ చెప్పారని తెలిపారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్‌ను ఎన్నుకోవాలన్నారు. అయితే ఇప్పటికే రెండుసార్లు సీఎంగా ఉండడంతో తాను నిరాకరించానని, ప్రజలు, కార్యకర్తలు కోరుకునే వారినే ముఖ్యమంత్రిని చేయాలని సూచించానని వివరించారు. ఇతరులు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పార్టీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతోనే చివరికి సీఎంగా ఉండేందుకు అంగీకరించానని పన్నీర్ సెల్వం తెలిపారు.

దీంతో షాక్ తిన్న శశికళ వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలను  తన నివాసం పోయెస్‌గార్డెన్‌కు పిలిపించుకుని సమావేశమయ్యారు. తనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన పన్నీర్‌ను  పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో దిండిగల్ శ్రీనివాసన్‌ను నియమించారు. పన్నీర్ ప్రకటనపై శశికళ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతుండగా, పన్నీర్ మద్దతుదారులు, శశికళ వ్యతిరేక వర్గం వారు సంబరాలు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News