: 40 నిమిషాలు మౌన దీక్ష చేసిన పన్నీర్ సెల్వం
40 నిమిషాలపాటు తమిళనాడులో కలకలం రేగింది. ఏం జరుగుతోందంటూ అన్నాడీఎంకేకు చెందిన ప్రతి అభిమాని ఆందోళనకు గురైన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు శశికళ పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని పన్నీర్ సెల్వంను శశికళ ఆదేశించడం, దానిని ఆయన ఆచరించడం, వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించడం వరుసగా జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుంచి పార్టీ కార్యకర్తలు, శశికళకు అందుబాటులో లేని పన్నీర్ సెల్వం అకస్మాత్తుగా సాయంత్రం మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్ద మౌనదీక్షకు దిగారు. సుమారు 40 నిమిషాలు ఆయన జయలలిత సమాధివద్ద మౌనంగా కూర్చున్నారు. దీంతో తమిళనాడులో కలకలం రేగింది. పార్టీ కార్యకర్తలంతా పన్నీర్ సెల్వంకు మద్దతుగా బీచ్ కు చేరుకుంటుండడంతో ఆయన మౌన దీక్ష విరమించారు. కాగా, శశకళ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ మారాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో అన్నాడీఎంకేలో ముసలం పుట్టినట్టేనని అంతా భావిస్తున్నారు.