: తీర్పు వస్తుందని శశికళ ప్రమాణ స్వీకారమే ఆగిపోయింది.. రేపు జగన్‌పై తీర్పు వస్తే ఏమవుతుందో గుర్తుంచుకోవాలి!: సోమిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తమ నాయకుడు చంద్రబాబు నాయుడు హీరో అయితే.. జగన్ విలన్ అని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి జగన్ అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో హీరోగానే ఉన్నారని, జగన్ లాంటి వారు ఆయనను ఎంత అవినీతిపరుడిగా చిత్రీకరించాలని కుట్రలు పన్నినా అవి సాధ్యం కాలేదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు నుంచి తీర్పు వస్తుందని తమిళనాడులో శశికళ నటరాజన్ ప్రమాణ స్వీకారం ఆగిపోయిందని చెప్పిన సోమిరెడ్డి.. జగన్ కూడా ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, ఎంతో అవినీతి చేశారని, రేపు సీబీఐ కోర్టు నుంచి తీర్పు వస్తే జగన్ పరిస్థితి ఏమవుతుందో గుర్తుంచుకోవాలని సూచించారు. చంద్రబాబును జగన్ విమర్శించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. జగన్ తన భాషను మార్చుకోవాలని ఆయన చెప్పారు. జగన్ అవినీతి, దోపిడీ కేసులను మూటకట్టుకున్నారని అన్నారు. జగన్ ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కోర్టుల నుంచి తీర్పు వస్తే జగన్ ఏమైపోతారు? అని ఆయన ప్రశ్నించారు.