modi: మొత్తానికి నిన్న ఉత్తర భారతదేశంలో భూకంపం వచ్చింది: రాహుల్ ‘భూకంపం’ వ్యాఖ్యలపై మోదీ


పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న‌ కేంద్ర ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత‌లు చేస్తోన్న ప‌లు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఇటీవ‌లే కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ తాను మాట్లాడితే భూకంపం వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించిన విష‌యం విదిత‌మే. రాహుల్ వ్యాఖ్య‌ల‌పై లోక్‌స‌భ‌లో మోదీ స్పందిస్తూ... భూకంపం వస్తుందని రాహుల్‌గాంధీ అన్నారని, మొత్తానికి నిన్న ఉత్తర భారతదేశంలో వచ్చిందని చుర‌క‌లంటించారు. త‌న‌కిప్పుడు ఆ భూకంప మూలం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందని అన్నారు.

స్వాతంత్ర్య పోరాటంలో పోరాడామ‌ని ప‌దేప‌దే చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను ఉటంకిస్తూ మాట్లాడిన మోదీ.. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఓ కుటుంబం (కాంగ్రెస్‌) కబంధ హస్తాల కింద నలగకుండా జనశక్తి కాపాడిందని వ్యాఖ్యానించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశ ప్రధాని కాగలిగారంటే అది ఈ దేశ ప్రజాస్వామ్య గొప్పదనమేనని ఆయ‌న పేర్కొన్నారు. భార‌త ప్రజలను అవమానించే రీతిలో ప్ర‌తిప‌క్ష నేతలు మాట్లాడటం మంచిది కాద‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించడానికి ముందే 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చిందని చెప్పిన మోదీ.. బ్రిటిష్ వారిపై జ‌రిగిన ఆ తిరుగుబాటుకు కూడా తామే కారణమని కాంగ్రెస్‌ చెప్పగలదా? అని ప్రశ్నించారు.  

  • Loading...

More Telugu News