: జెయింట్ పాండా 'బావో బావో'కు వీడ్కోలు పలుకుతున్న అమెరికా!
జెయింట్ పాండాగా వాషింగ్టన్ లోని స్మిత్ సోనియన్స్ జాతీయ జంతు ప్రదర్శనశాలలో నిత్యమూ ఎంతో మందిని ఆహ్లాదపరిచే 'బావో బావో' చైనాకు బయలుదేరనుంది. ఈనెల 21న ఈ పాండాకు వీడ్కోలు పలకనున్నట్టు అమెరికన్ అధికారులు తెలిపారు. ఆగస్టు 23, 2013న ఇదే జూలో జన్మించిన బావోకు ఇష్టమైన బాంబూ, యాపిల్స్, పీర్స్ ను కానుకగా ఇచ్చి, ఓ వెటర్నరీ డాక్టర్ ను తోడుగా చెంగ్డూకు పంపనున్నట్టు పేర్కొన్నారు. చైనాతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, అమెరికాలో జన్మించే పాండాలకు నాలుగేళ్ల వయసు వచ్చేలోగా వాటిని చైనాకు తప్పనిసరిగా పంపాల్సి ఉంది.
బావో బావో కు వీడ్కోలుగా 16 నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ జూలో మూడు జెయింట్ పాండాలున్నాయి. బావో బావో వెళ్లిపోతే, మగ పాండా టియాన్ టియాన్, ఆడ పాండా మీ క్సియాంగ్, ఒక సంవత్సరం వయసున్న బుల్లి మగ పాండా బీ బీలు వాషింగ్టన్ జూలో మిగులుతాయి. అంతకుముందు 2005లో జన్మించిన తాయ్ షాన్ అనే జయింట్ పాండాను 2010లో చైనాకు తరలించారు. మగ, ఆడ పాండాలను అమెరికాకు ఇస్తున్న సమయంలోనే వాటికి పుట్టే పిల్లలను చైనాకు అప్పగించాలన్న ఒప్పందానికి యూఎస్ అంగీకరించింది.