: అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలని బాలయ్య అన్నారు..టీడీపీ నేతలు ఆడవారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు!: రోజా విమర్శలు
టీడీపీ నేతలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... కాల్ మనీ రాకెట్లు రాష్ట్రానికే సిగ్గుచేటని అన్నారు. అలాంటి దారుణాలకు పాల్పడుతున్న నిందితులని ఏమీ అనకుండా చంద్రబాబు సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు. తనను నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి బయటకు నెట్టేశారని ఆమె అన్నారు.
తెలుగు దేశం పార్టీ తెలుగు దుర్యోధనుల పార్టీలా మారిందని ఆమె ఆరోపించారు. భారత మాత గుండెలపై నడిచే ఆడబిడ్డలకు రక్షణలేదని, తెలుగు తల్లి ఒడిలో ఉండే తెలుగు ఆడపడుచులకు రక్షణ లేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆడవారిపై అరాచకాలు జరుగుతున్నాయని, వారిని అడ్డంగా తొక్కేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళా పార్లమెంటు సదస్సులో చంద్రబాబు నాయుడికి మాట్లాడే అర్హత లేదని ఆమె అన్నారు. క్షమాపణలు చెప్పిన తరువాతే అక్కడ చంద్రబాబు నాయుడు అడుగుపెట్టాలని రోజా డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా చేస్తానని, ఆడవారి జీవితాల్లో వెలుగులు నింపుతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అక్కడకు వస్తారని ఆమె ప్రశ్నించారు. అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలని, కడుపు చేయాలని చంద్రబాబు బావమరిది బాలయ్య అన్నారని రోజా మండిపడ్డారు. టీడీపీ నేతలు ఆడవారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను వేధించిన రావెల కిషోర్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడవారిని అంగట్లో బొమ్మల్లా చూస్తున్నారని ఆమె అన్నారు. టీడీపీ తీరు ఎంతో మంది ఆడపిల్లల చావుకి కారణమవుతోందని మండిపడ్డారు.