: ఏప్రిల్ నుంచి... ఎంత ఆదాయం పొందితే ఎంత పన్ను కట్టాలంటే..!


వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు, వేతన జీవులకు తన బడ్జెట్ ప్రతిపాదనల్లో అరుణ్ జైట్లీ కొన్ని మినహాయింపులను ప్రకటించారు. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ సంవత్సరాదాయం పొందుతున్న వారిపై కరుణ చూపుతూ, 10 శాతంగా ఉన్న పన్నును ఐదు శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఆపై శ్లాబులను మార్చడం లేదని స్పష్టం చేశారు. ఆపై వార్షికాదాయం రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా ఉన్నవారిపై 30 శాతం పన్నుకు అదనంగా 10 శాతం సర్ చార్జ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. 2018-19 అసెస్ మెంట్ సంవత్సరం నుంచి వివిధ స్థాయిల్లో ఆదాయాన్ని పొందుతున్నవారు చెల్లించాల్సిన పన్ను ఎంతంటే...

జనరల్ కేటగిరీ (60 సంవత్సరాల వయసు వరకూ)
ఈ విభాగంలో రెండున్నర లక్షల రూపాయల వరకూ ఆదాయాన్ని పొందుతున్న వారు ఎలాంటి పన్నూ చెల్లించనవసరం లేదు. ఆపై రూ. 5 లక్షల వరకూ ఆదాయం ఉంటే 5 శాతం పన్ను చెల్లించాలి. వీరికి  ప్రస్తుతం  ఉన్న రిబేటు రూ. 5 వేలను  రూ. 2,500 కు తగ్గించారు. అంటే, రూ. 3 లక్షల వరకూ ఆదాయం ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. 80సి క్రింద టాక్స్ బెనిఫిట్ ను కూడా పూర్తిగా ఉపయోగించుకుంటే రూ. 4,50,000 వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

* రూ. 2.5 లక్షల వరకూ ఆదాయంపై పన్ను ఉండదు.
* రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ 5 శాతం.
* రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ 20 శాతం.
* రూ. 10 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను చెల్లించాలి.

సీనియర్ సిటిజన్లు (60 నుంచి 80 సంవత్సరాల వయసు)
రూ. 3 లక్షల వరకూ ఆదాయం పొందుతున్న వారిపై పన్నులుండవు. ఆపై రూ. 5 లక్షల వరకూ 5 శాతం, మిగతా శ్లాబుల్లో ఉంటే సాధారణ కేటగిరీ కిందకే సీనియర్ సిటిజన్లు వస్తారు.
* రూ. 3 లక్షల వరకూ ఆదాయంపై పన్ను ఉండదు.
* రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ 5 శాతం.
* రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ 20 శాతం.
* రూ. 10 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను చెల్లించాలి.

సూపర్ సీనియర్ సిటిజన్లు (80 సంవత్సరాలకు పైబడిన వారు)
80 ఏళ్లు దాటిన వారికి రూ. 5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఆపై వీరు కూడా సాధారణ కేటగిరీలోకే వస్తారు.
* రూ. 5 లక్షల వరకూ ఆదాయంపై పన్ను ఉండదు.
* రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ 20 శాతం.
* రూ. 10 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను చెల్లించాలి.

  • Loading...

More Telugu News