: ఔటయ్యాననే కోపంతో స్టంప్ విసిరిన బ్యాట్స్ మన్... ఫీల్డర్ మెడలో దిగి దుర్మరణం!
ఔటయ్యాననే కోపంతో బ్యాట్స్ మన్ స్టంప్ విసిరేయడంతో ఫీల్డర్ దుర్మరణం చెందిన విషాద సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. స్థానికంగా ఉన్న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక జట్టు బ్యాట్స్ మెన్ తాను ఔటయ్యాననే కోపంలో స్టంప్ ను గాల్లోకి గట్టిగా విసిరాడు. అయితే, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న పద్నాలుగు సంవత్సరాల ఫైజల్ హుస్సేన్ మెడ వెనుక భాగంలో బలంగా దిగింది. దీంతో, తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతను మరణించాడు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ, సదరు బ్యాట్స్ మన్ ఉద్దేశపూర్వకంగా స్టంప్ విసరలేదనే కోణంలో కేసు నమోదు చేశామన్నారు.