: అసెంబ్లీలో తన స్పీచ్ ను ‘ఫేస్ బుక్’లో లైవ్ పెట్టిన ఎమ్మెల్యే.. మూడు రోజుల సస్పెన్షన్!
అస్సాం అసెంబ్లీలో తన స్పీచ్ ను ప్రజలకు లైవ్ లో చూపించాలని భావించిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం చేసిన పని వివాదాస్పదమైంది. ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం ఈ నెల 3న అసెంబ్లీలో అక్రమ వలసల సమస్యపై ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా, తన ప్రసంగాన్ని ఆయన ముందుగా ఏర్పాటు చేసుకున్న విధంగా ‘ఫేస్ బుక్’ లైవ్ లో పెట్టారు. అసెంబ్లీలోని ఇతర ఎమ్మెల్యేలు ఈ సంఘటనపై స్పీకర్ హితేంద్రనాథ్ గో స్వామికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఎథిక్స్ కమిటీతో విచారణ చేపట్టి, ఈరోజు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.
ఈ నివేదిక ప్రకారం, సభా నియమాలను అమినుల్ ఉల్లంఘించారని, కొన్ని రోజుల పాటు సభ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని సూచించింది, ఈ నేపథ్యంలో అమినుల్ ను మూడు రోజుల పాటు అంటే ఈ నెల 8వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ సభ్యుడు అయిన అమినుల్ ఈ విధంగా ప్రవర్తిస్తారని అనుకోలేదని, ఇది అంత చిన్న తప్పు కాదని స్పీకర్ వ్యాఖ్యానించారు.
కాగా, స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, అయితే, అసెంబ్లీ కార్యకలాపాలు మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలని అమినుల్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం నిమిత్తం సభలో సభ్యులు ఏమి మాట్లాడుతున్నారో ప్రజలు చూడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.