: అనుమానంతో భార్య తల నరికి.. ఆ తలను తన బావకు చూపించిన వ్యక్తి!
అనుమానం పెనుభూతంగా మారి ఓ మహిళ ప్రాణాన్ని బలిగొన్న దారుణ ఘటన తిరుపతి రూరల్ మండలం వకుళామాత ఆలయం సమీపంలోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి అమెను అతి దారుణంగా చంపేశాడు. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మునుస్వామి అనే వ్యక్తి బతుకుతెరువు కోసం తిరుపతికి వచ్చాడు. ఆయనకు తొమ్మిదేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన చిత్రతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గతకొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న మునుస్వామి శనివారం రాత్రి తన పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. అనంతరం భార్యతో గొడవ పెట్టుకొన్నాడు.
అందరూ నిద్రపోయిన తరువాత గుడెసెలో తనకు కనిపించిన గొడ్డలిని తీసుకుని భార్య తలనరికి, దానిని మొండెం నుంచి వేరు చేసి, ఆ తర్వాత ఆ తలను తీసుకుని పక్కనే కాపురం ఉంటున్న చిత్ర సోదరుడు చంద్రను నిద్రలేపి చూపించాడు. షాక్‌కు గురయిన చంద్ర అందులోంచి తేరుకునేలోపే అక్కడినుంచి మునుస్వామి పరారయ్యాడు. వెంటనే చంద్ర ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు.