: కాబోయే ముఖ్యమంత్రి శశికళపై మండిపడ్డ ఎంపీ శశికళ పుష్ప
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ అంశంపై అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప స్పందించారు. శశికళ సీఎం అవడాన్ని తాను తిరస్కరిస్తున్నట్లు తెలిపిన ఆమె... శశికళకు నేర చరిత్ర ఉందని అన్నారు. ఆమెపై ఎన్నో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అటువంటి వారు ముఖ్యమంత్రి ఎలా అవుతారని నిలదీశారు. శశికళ అన్నాడీఎంకే కోసం ఏ మాత్రం కృషి చేయలేదని, ఒకవేళ ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శశికళ పుష్ప అన్నారు. ఆమె ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు తమిళనాడు ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు ఈ విషయమై ఓ లేఖ రాశారు.