: కొన్ని రోజుల్లోనే అధికారంలోకి డీఎంకే.. శశికళకు పరాభవం తప్పదు: అన్బళగన్ జోస్యం
రానున్న కొన్ని రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవిస్తాయని డీఎంకేకు చెందిన చేపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్బళగన్ చెప్పారు. అధికార పీఠాన్ని డీఎంకే కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్న ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు పరాభవం తప్పదని అన్నారు. దివంగత జయలలిత కూడా శశికళను తన సన్నిహితురాలిగానే చూశారే తప్ప... పార్టీలో చిన్న పదవి కూడా ఇవ్వలేదనే విషయాన్ని గుర్తు చేశారు. జయ మరణం తర్వాత పార్టీని, పాలనను తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్న కోరికను శశి తీర్చుకున్నారని విమర్శించారు. జయ మరణంపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.