: తమిళనాడులో రాజకీయాల్లో ఆకస్మిక మార్పులు.. రేపో, మాపో ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం!
అన్నాడీఎంకే చీఫ్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమె సోమవారమే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశాలున్నాయి. శనివారం రాష్ట్ర రాజకీయాల్లో అకస్మాత్తుగా సంభవించిన పెను మార్పులు ఇందుకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. జయలలిత నమ్మినబంటు అయిన ప్రభుత్వ సలహాదారు షీలా తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జయ నియమించిన ఇద్దరు ఐఏఎస్‌లు సెలవుపై వెళ్లారు.
సాధారణంగా శశికళ వెంట ఉండి, ఆమె వెళ్లే ముందు కారు వరకు వచ్చి సాగనంపే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమెకు దూరంగా ఉన్నారు. శుక్రవారం మెరీనాబీచ్ వద్ద అన్నాదురైకు అంజలి ఘటించి వెళ్తున్న చిన్నమ్మకు సీఎం ముఖం చాటేశారు. తమిళనాడులో మారిన ఆకస్మిక రాజకీయానికి ఇవి ఉదాహరణలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీటన్నింటిని పక్కనపెడితే నేటి (ఆదివారం) మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని శశికళ ఆకస్మిక ఆదేశాలు జారీ చేయడం ఏదో జరుగుతోందన్న వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
పార్టీపై పూర్తి పట్టు సాధించిన చిన్నమ్మ ఈనెలలోనే ఓ ఫైన్‌డే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే చెన్నై రావాలంటూ 136 మంది ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. అకస్మాత్తు పిలుపుతో ఆశ్చర్యానికి గురైన ఎమ్మెల్యేలు ఆగమేఘాలపై శనివారం సాయంత్రమే నగరానికి చేరుకున్నారు. ఈనెల 6, 8, 9, లేదంటే ఈనెల 24వ తేదీల్లో ఏదో ఒక రోజు శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
శశికళ ఆశలు ఎలా ఉన్నా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు పన్నీర్ సెల్వం సిద్ధంగా లేరు. కేంద్రం నుంచి, ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్న తానెందుకు తప్పుకోవాలంటూ ఇటీవల పన్నీర్ సెల్వం శశికళ మద్దతుదారులను ప్రశ్నించినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం తన పట్టాభిషేకానికి శశికళ రంగం సిద్ధం చేసుకుంటుండడంతో పన్నీర్ వెనక్కి తగ్గుతారో, ఎదురెళ్తారో వేచి చూడాల్సిందే.