: మనమంతా దుర్యోధనులం.. ఏం చేయకూడదు అనుకుంటామో అదే చేస్తాం!: రజనీకాంత్


మనమంతా దుర్యోధనులమని ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. చెన్నైలో రజనీకాంత్ కళ్యాణ మండపంలో పరమహంస యోగానంద రచించిన 'ది డివైన్ రొమాన్స్' తమిళ అనువాదం 'దైవీక కాదల్' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, తాను స్వయంగా ఓ పుస్తకాన్ని విడుదల చేయడం ఇదే మొదటిసారని అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చూసిన మహోన్నత వ్యక్తులు మనకు అందించిన పుస్తకం కావడం వల్లే దీన్ని ఆవిష్కరించానని ఆయన చెప్పారు. మనమంతా దుర్యోధనుడిలాగే ఏం చేయకూడదు అనుకుంటామో అదే చేస్తామని ఆయన చెప్పారు.

అలా కాకుండా అర్జునుడిలా ఏం చేయాలనుకుంటామో అది మాత్రమే చేయగలిగితే మనిషి జీవితం భగవంతుడిని చేరుతుందని తెలిపారు. తనను ఓ సినిమా స్టార్‌ గా చూడడం కంటే ఆధ్యాత్మికవాది అని గుర్తించడాన్ని ఎక్కువ ఇష్టపడతానని ఆయన పేర్కొన్నారు. సినిమాల కంటే కూడా తనకు ఆధ్యాత్మిక మార్గమే ఇష్టమని ఆయన చెప్పారు. మనిషి జన్మ అనేది దేవుడి కృప అని, మానవత్వంతో జీవిస్తేనే ఆ జన్మకు సార్ధకత చేకూరుతుందని ఆయన సూచించారు. తాను రామకృష్ణ పరమహంస నుంచి జీవితాన్ని నేర్చుకున్నానని ఆయన తెలిపారు. అలాగే రమణ మహర్షి  రాసిన 'నేను ఎవరిని' అనే పుస్తకం నుంచి మనిషి జీవన గమనాన్ని గ్రహించానని ఆయన వెల్లడించారు. జీవితాన్ని సార్ధకత చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గమే సరైనదని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News