: ఆ మ్యాగజీన్ చదవొద్దు... అలాంటి మేగజీన్లు ఎన్నో కుటుంబాలను కూల్చాయి: అక్షయ్ కుమార్
షోబిజ్ లాంటి ఎంటర్ టైన్ మెంట్ మ్యాగజీన్లు చదవొద్దని బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ సలహా ఇచ్చారు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన అక్షయ్ ను వ్యాఖ్యాత గతంలో ఆ మేగజీన్ ప్రచురించిందంటూ మూడు వివాదాలను ప్రస్తావించారు. వాటిపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ, ప్రియాంకా చోప్రాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు. అవకాశం వస్తే ఆమెతో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. ఫరాఖాన్ తో తనకు గొడవ జరగలేదని అన్నాడు.
ఫరాతో పాటు ఆమె సోదరుడు సాజిద్ ఖాన్ కూడా తనకు స్నేహితుడేనని అన్నాడు. ఇక స్నేహితుల మధ్య గొడవలేముంటాయని ఎదురు ప్రశ్నించాడు. మరి ఏక్తా కపూర్ తో వివాదం గురించి అనగానే... 'అసలు వీళ్లందరితో తనకు వివాదాలున్నాయని ఎవరన్నారు?... వాళ్లకి ఫోన్ చేయండి, మాట్లాడుతాను' అన్నాడు. అసలీ పుకార్లు ఎవరు రేపారు? అంటూ ప్రశ్నించాడు. దీంతో షోబిజ్ మేగజీన్ లో చదివాననగానే...'ముందలాంటి మేగజీన్లు చదవడం మానెయ్యండి. అలాంటి మేగజీన్లు గతంలో ఎన్నో కాపురాలు కూల్చాయి' అంటూ సమాధానమిచ్చాడు.