: డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది.. ఇక అందరం ఏకమవుదాం: ఈయూకు ఫ్రాన్స్ పిలుపు
నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) నుంచి బయటకు రావడమే కాకుండా ఎన్నో ఏళ్లుగా యూరోపియన్ యూనియన్(ఈయూ)కు ప్రత్యర్థి దేశంగా ఉన్న రష్యాతో స్నేహం చేస్తానని తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుతో ఈయూ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగామాల్టా రాజధాని వలెటాలో జరిగిన ఈయూ అనధికార సదస్సులో పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి, రష్యాతో అమెరికా కలవడం ప్రమాద హెచ్చరికలను తెలియజేస్తుందని ఈయూ నేతలు అన్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఈ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నుంచి వస్తోన్న‘ఒత్తిడి’ని అడ్డుకోకుంటే యూరప్ మనుగడలో లేకుండాపోయే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయనను అడ్డుకునేందుకు ఈయూలోని 28 దేశాలూ ఒక్కతాటిపైకి రావాలని ఆయన అన్నారు. ఆయా దేశాలు అమెరికా, రష్యాలపై ఇకపై ఆధారపడటం మానుకోవాలని, సొంతంగా రక్షణ, వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. లేదంటే యూరప్ విచ్ఛితి తప్పదని హెచ్చరించారు.
అమెరికాకు వచ్చే శరణార్థుల విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ యూరప్ పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని, ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో అమెరికాతో పాటు రష్యా కలిసి అందులోని దేశాలను విచ్ఛిన్నం చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. అందులో నిజం కూడా లేకపోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి వస్తోన్న ఒత్తిడిని తరిమేద్దామని, నాటో లాంటివే సంయుక్త రక్షణ దళాలను ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు.