: పాతకాపులకు మళ్లీ పార్టీ పదవులు.. 'దటీజ్ శశికళ' అంటున్న నేతలు!
అన్నాడీఎంకే చీఫ్ శశికళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాతకాపులకు పదవులు కట్టబెట్టడం ద్వారా పార్టీలో సంస్థాగతంగా పెను మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నారు. కొన్ని రోజులుగా పార్టీలోని సీనియర్ నేతలతో నిర్వహించిన సమావేశాల్లో సేకరించిన వివరాల ఆధారంగా పదవుల పందేరానికి తెరతీయనున్నట్టు సంకేతాలు పంపించారు. ఇప్పటికే పార్టీలోని కొందరిని తప్పించిన శశికళ సీనియర్ నేతలు కేఏ సెంగొట్టయ్యన్, గోకుల ఇందిర, సైదై దురైస్వామి, కరుప్పుస్వామి పాండ్యన్ వంటి నేతలను పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం శశికళ పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తాను పార్టీ బలోపేతం కోసం కొందరిని కార్యనిర్వహణ కార్యదర్శులుగా నియమించానని, కొందరిని తప్పించానని అందులో పేర్కొన్నారు. అలాగే పార్టీ కార్య నిర్వాహకుల్లో కూడా మార్పులు చేశామని పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన శశికళ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న నేతలు దటీజ్ శశికళ అంటూ ప్రశంసిస్తున్నారు.