: డీమోనిటైజేషన్ తర్వాత బ్యాంకు ఉద్యోగుల అక్రమాల విలువ రూ.71.47 కోట్లు
గత ఏడాది నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన అనంతరం బ్యాంకు ఉద్యోగులు పలు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల అక్రమాలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వర్ లోక్ సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పెద్దనోట్ల రద్దు అనంతరం కొన్ని బ్యాంకుల ఉద్యోగులు చేసిన అక్రమాల విలువ రూ.71.47 కోట్లు అని పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు నగదు మార్పిడికి సంబంధించి అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని తెలిపారు.
యాక్సిస్ బ్యాంకు మూడు బ్రాంచ్ ల ద్వారా అత్యధికంగా రూ.46.29 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని, ఆ తర్వాత ధనలక్ష్మి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సిండికేట్ బ్యాంకులలో జరిగిన అక్రమ లావాదేవీలు వరుసగా రూ.22.7 కోట్లు, రూ.1.9 కోట్లు, రూ.54.90 లక్షలు, రూ.6 లక్షలుగా పేర్కొన్నారు. అంతేకాకుండా అక్రమ లావాదేవీల వ్యవహారాలకు సంబంధించి యాక్సిస్ బ్యాంకు ఉద్యోగులు ఎనిమిది మంది ఆరు కేసుల్లో నిందితులుగా ఉండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉద్యోగులపై రెండు కేసులు ఉన్నాయని, నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిందని పేర్కొన్నారు. సిండికేట్ బ్యాంకుపై ఒక కేసు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై రెండు కేసులు ఉండగా, ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు.