: అమెరికా వెళుతున్నానని చెప్పి ప్రియుడి వద్దకు వెళ్లి.. హత్యకు గురైన మహిళ!


ప్ర‌స్తుత కాలంలో సోష‌ల్ మీడియా హ‌వా ఎంత‌గా ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే, అదే సోష‌ల్ మీడియా ద్వారా ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ముక్కుమొహం తెలియ‌ని వారి ప్రేమ‌లో ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి భోపాల్‌లో చోటుచేసుకుంది. సామాజిక మాధ్య‌మం ద్వారా ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి ఓ 28 ఏళ్ల మహిళ నిండు ప్రాణం తీసింది. ప్రేమించాడని నమ్మి మోస‌పోయిన ఆ మ‌హిళ‌ అతడి వద్దకు వెళ్లింది. ఆమెతో కొన్ని రోజులు గడిపిన అనంతరం ఆ వ్య‌క్తి ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు.
 
ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ఆకాంక్ష శర్మ అనే మహిళకు సామాజిక మాధ్య‌మాల్లో ఉద్యాన్‌ దాస్‌ అనే వ్యక్తి ప‌రిచయం అయ్యాడు. అనంత‌రం అందులోనే క‌బుర్లు చెప్పుకొని, కొన్నాళ్లకు ప్రేమ‌లో ప‌డ్డారు. కొన్ని రోజుల త‌రువాత‌ తాను అమెరికా వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన ఆకాంక్ష.. అనంత‌రం ఇంట్లో వారికి ఫోన్ చేసి అమెరికాలోనే ఉన్నట్లుగా మాట్లాడేది. అయితే, ఆమె అమెరికా వెళ్లకుండా ఆన్‌లైన్‌లో పరిచయం అయిన దాస్‌ వద్దకు వెళ్లింది. గ‌త ఏడాది డిసెంబర్‌ వరకు ఫోన్‌లో మాట్లాడిన త‌మ కూతురు అప్ప‌టి నుంచి ఫోన్ చేయ‌క‌పోవ‌డంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆకాంక్ష‌ ఫోన్ నెంబ‌రు సిగ్నల్స్‌ ట్రాక్‌ చేసిన పోలీసులు భోపాల్‌ నుంచి ఆ ఫోన్ కాల్‌ వచ్చినట్లు గుర్తించారు. అనంత‌రం పోలీసులు నేరుగా దాస్‌ ఇంటికి వెళ్లి, అతడిని విచారించి ఇళ్లంతా సోదాలు చేశారు. అత‌డి నట్టింట్లో కాంక్రీట్‌తో కట్టిన నిర్మాణం గుర్తించి దానిని డ్రిల్లింగ్ చేసి పగులగొట్టి చూడగా, అందులో నుంచి ఆకాంక్ష మృతదేహం బయటపడింది. తానే ఆమెను గొంతునులిమి చంపి మెటల్‌ బాక్స్‌లో పెట్టి కాంక్రీట్‌ వేసి కప్పెట్టానని నిందితుడు అంగీక‌రించాడు.

  • Loading...

More Telugu News