: మహిళ ముక్కులో దూరిన బొద్దింక.. కళ్ల మధ్య వరకు వెళ్లిపోయింది!
మహిళ ముక్కులో దూరిన ఓ పెద్ద బొద్దింక ఆమెను ఆసుపత్రుల చుట్టూ తిరిగేలా చేసిన ఘటన చెన్నయ్‌లో చోటు చేసుకుంది. ఆమె ముక్కు రంధ్రం గుండా మెల్లిగా వెళ్లి అది కళ్ల మధ్య వరకు చేరుకుంది. నొప్పితో ఆమె మూడు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆఖరికి ఓ పెద్దాసుపత్రిలో వైద్యులు జాగ్రత్తగా ఆ బొద్దింకను బయటకు తీశారు. డాక్టర్ల చేతికి చిక్కేనాటికి ఆ బొద్దింక ప్రాణాలతోనే ఉండడం విశేషం. నగరంలోని ఇంజంబాకం ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల సెల్వి అనే మహిళ రాత్రి నిద్రపోతుండగా అర్ధరాత్రి ముక్కులో ఏదో దురద పుట్టినట్లనిపించింది.
అయితే, జలుబు వల్లే తన ముక్కులో అలా దురద వస్తోందని అనుకుంది. అయితే, కాసేపటికి ఇబ్బంది అధికమై పోతుండడంతో ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ముక్కు లోపల ఏదో అడ్డుపడి ఉంటుందనుకుని భావించిన డాక్టర్లు, నీళ్లను లోపలకు పంప్ చేసి దాన్ని బయటకు తీద్దామని ప్రయత్నించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. దాంతో ఆమె మళ్లీ మరో ఆసుపత్రికి వెళ్లగా, ముక్కులోపల ఏదో కదులుతున్న వస్తువు ఉందని గుర్తించి, స్కాన్ చేయాలన్నారు. అయితే, ఆ తెల్లారి ఆమెకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావడంతో స్టాన్లీ మెడికల్ కళాశాల ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగానికి ఆమెను తరలించారు.
అక్కడ ఆమె ముక్కుకు ఎండోస్కోపీ చేసి చూసిన వైద్యులు రెండు చిన్న యాంటెన్నాల లాంటివి గుర్తించారు. అయితే, అది పెద్ద బొద్దింకేనని ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ ఎంఎన్ శంకర్ పేర్కొన్నారు. అనంతరం వైద్యులు ఒక సక్షన్, ఫోర్‌సెప్స్ ఉపయోగించి ఆ బొద్దింకను బయటకు తీశారు. సుమారు 12 గంటలపాటు ఆమె ముఖంలోపల ఉన్న ఆ బొద్దింకను డాక్టర్లు బయటకు తీసేందుకు 45 నిమిషాల సమయం పట్టింది. ముక్కులో చిన్న చిన్న వస్తువులు పెట్టుకుని ఇబ్బంది పడుతూ తమ వద్దకు వచ్చిన వారు వున్నారు కానీ, ఇలా ముక్కులో బతికున్న బొద్దింకతో పేషెంట్ రావడం మాత్రం ఇదే తొలిసారని వైద్యులు అన్నారు.