: ఎమ్మెల్యే అంటే అంత చులకనగా ఉందా?.. ఎస్పీ, ఎస్టీ కేసు పెడతా: వైకాపా ఎమ్మెల్యే శ్రీనివాసులు
వ్యవసాయ శాఖ నూతన భవన ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం పంపకపోవడం పట్ల రైల్వే కోడూరు వైకాపా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రొటోకాల్ పాటించడం కూడా తెలియదా? అంటూ వ్యవసాయ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం, ఏఓ మల్లికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన ప్రారంభోత్సవానికి హాజరైన కొరముట్ల మాట్లాడుతూ, ఎమ్మెల్యేనైన తనకు ఆహ్వానం పంపాలన్న కనీస జ్ఞానం కూడా లేదా? అంటూ ఫైర్ అయ్యారు. తనను అవమానించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తానని హెచ్చరించారు. ఈ విషయాన్న అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, స్పీకర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఎమ్మెల్యే అంటే అంత చులకనగా ఉందా? అంటూ నిప్పులు చెరిగారు. రైతులకు ఎంతో ముఖ్యమైన వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందులను ఇవ్వాల్సిన అధికారులు సక్రమంగా పని చేయడం లేదని అన్నారు.