: మోదీతో కలిసి రండి.. లేదా నోర్మూసుకోండి!: ప్రతిపక్షాలకు కిషన్ రెడ్డి ఘాటు హెచ్చరిక
ప్రధాని నరేంద్ర మోదీకి సహకరించాలని, లేని పక్షంలో నోరు మూసుకుని కూర్చోవాలని తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అన్ని వర్గాల నుంచి ఆదరణ వ్యక్తమవుతోందని అన్నారు. దీనిని ప్రతిపక్షాలు గమనించాలని ఆయన సూచించారు. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమా అని బడ్జెట్ లో 18 శాతం నిధులు అప్పుల చెల్లింపుకే సరిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విమర్శలను పట్టించుకోకుండా, రాజకీయ పార్టీలను ఐటీ పరిధిలోకి తేవడం సాహసోపేతమైన నిర్ణయమని ఆయన కొనియాడారు. అలాగే నగదు విరాళాలకు పరిమితి విధించడం కూడా సాహసోపేతమైన నిర్ణయమేనని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి అధికంగా నిధులు కేటాయించటం ద్వారా జైట్లీ తమది రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నారని ఆయన తెలిపారు.