: వీడియో పోస్ట్ చేసినందుకు నా భర్తను చిత్రహింసలు పెడుతున్నారు: జవాన్ భార్య తీవ్ర ఆవేదన
తమకు పెడుతున్న నాణ్యతలేని ఆహారం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ అనే ఓ సైనికుడు అధికారుల తీరును దేశ ప్రజలందరికీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతని భార్య షర్మిల తాజాగా పలు సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను అధికారులు అరెస్ట్ చేసి వేధిస్తున్నారని పేర్కొంది. ఆయనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తన భర్తే తనకు ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ చేసి చెప్పాడని ఆమె చెప్పింది. తన భర్త గత 31వ తేదీన ఇంటికి వస్తాడనుకున్నానని, కానీ రాలేదని ఆమె పేర్కొంది.
ఈ విషయంపై స్పందించిన ఉన్నతాధికారులు ఆమె చేస్తోన్న ఆరోపణలను కొట్టిపారేశారు. తాము తేజ్ బహదూర్‌ను అరెస్ట్ చేయలేదని అంటున్నారు. తేజ్ బహదూర్ తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని, ఆయనపై తాము క్రమశిక్షణ చర్యలు మాత్రమే తీసుకుంటామని అన్నారు.