: భుజంపై తన తల్లి మృతదేహాన్ని పది గంటలు మోసుకెళ్లిన జవాను!
పఠాన్ కోట్‌లో తాజాగా జరిగిన ఓ ఘటన అందరితో కన్నీరు పెట్టిస్తోంది. ఆ ప్రాంతంలో జవానుగా విధులు నిర్వర్తిస్తోన్న మహ్మద్ అబ్బాస్ వద్ద అతని తల్లి కూడా ఉంటోంది. అయితే, ఆమె గత ఐదు రోజుల క్రితం మృతి చెందింది. తన తల్లి మృతదేహాన్ని నియంత్రణ రేఖ వద్ద ఉన్న కర్ణా అనే గ్రామంలోకి తీసుకెళ్లి ఖననం చేయాలని మహ్మద్ అబ్బాస్ అనుకున్నాడు. అందుకోసం కశ్మీర్‌కు తన తల్లి మృతదేహంతో చేరుకున్నాడు. ఆ సమయంలో 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉండగా దారి మధ్యలో ఓ భారీ మంచుకొండ చరియ విరిగి పడడంతో స్పందించిన అధికారులు ఆ జవానుకు హెలికాప్టర్ ద్వారా సాయం చేస్తామని అన్నారు. తన తల్లి మృతదేహాన్ని అక్కడే ఉంచి హెలికాప్టర్ కోసం ఎదురు చూసిన జవానుకు నిరాశే మిగిలింది. నాలుగు రోజులుగా హెలికాఫ్టర్ రాలేదు.
ఎంతకీ హెలికాప్టర్ రాకపోవడంతో ఆమె మృతదేహాన్ని తన భుజాన వేసుకొని అబ్బాస్ సుమారు ఆరు మీటర్ల మేర పేరుకుపోయిన మంచులో నుంచి పది గంటలపాటు నడిచాడు. ఆయనకు మరికొంతమంది సాయం చేశారు. ఇది తనకు జరిగిన పెద్ద అవమానమని, తన తల్లికి గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయలేకపోయానని ఆ జవాను ఆవేదన వ్యక్తం చేశాడు. తమ అధికారులు తనకు సాయం చేయడానికి హెలికాప్టర్ పంపిస్తామని చెప్పి ఎంతకూ పంపించలేదని అన్నాడు. తాను మంచుముక్కలపై ప్రమాదకర స్థితిలో నడుచుకుంటూ తన తల్లి మృతదేహాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్లానని చెప్పాడు.
పక్కన తల్లి శవాన్ని పెట్టుకుని నాలుగు రోజుల పాటు ఎదురుచూసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. అంతేగాక, ఈ రోజు తన ఫోన్ కూడా కట్ చేశారని ఆయన చెప్పాడు. అందుకే తాను తన తల్లిని భుజంపై మోసుకెళ్లాల్సి వచ్చిందని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ తాము ఈ రోజే హెలికాప్టర్ సిద్ధం చేశామని అన్నారు. అయితే, హెలికాప్టర్ దిగే చోటులేకపోవడంతో వారే వద్దన్నారని అంటున్నారు.