: నడిరోడ్డుపై తల్లిని కంపాస్‌తో పొడిచిన కుర్రాడు!
తిరువనంతపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసీ, కనీ అల్లారు ముద్దుగా పెంచిన తన తల్లినే పొడిచేశాడో కుర్రాడు. చిన్న వయసులోనే అతడు మత్తు పదార్థాలకు బానిస కావడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. తిరువనంతపురంలోని సచివాలయం దక్షిణ ద్వారం వద్ద ఓ టీనేజర్ తన తల్లిని కంపాస్‌తో పొడిచేశాడని తెలిపారు. ఆ కుర్రాడు ఈ దారుణానికి పాల్పడిన ఘటనపై కారణాలు ఇంకా తెలియరాలేదని అన్నారు.
సదరు తల్లీకొడుకులు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న సమయంలో ఇద్దరూ గొడవ పడ్డారని, ఈ క్రమంలో కొడుకు తన తల్లి మెడపై కంపాస్‌తో పొడిచేశాడని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోందని చెప్పారు. నిందితుడి నుంచి ఓ చాకును కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.