: ఆన్ లైన్ వ్యాపారం పేరుతో ఏడు లక్షల మందికి 3,700 కోట్ల కుచ్చుటోపీ!: యూపీ పోలీసుల వెల్లడి
ఆన్ లైన్ బిజినెస్ పేరిట సుమారు ఏడు లక్షల మందికి 3,700 కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన కేసును ఛేదించినట్టు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రకటించారు. నోయిడాలోని అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ పేరుతో కంపెనీ నడుపుతూ సుమారు ఏడు లక్షల మందిని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి, నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నిందితులు ఏడు లక్షల మంది ఇన్వెస్టర్ల నుంచి సుమారు 3,700 కోట్ల రూపాయలు పెట్టుబడిగా సంపాదించారని తెలిపారు. 'ప్రతి క్లిక్ కు 5 రూపాయలు సంపాదించు' అంటూ మోసానికి పాల్పడ్డారని చెప్పారు.
సోషల్ ట్రేడ్, బిజ్ పేరుతో వెబ్ పోర్టల్ నడుపుతూ అందులో సభ్యులయ్యేందుకు ఇన్వెస్టర్ల నుంచి 5,750 రూపాయల నుంచి 57,500 రూపాయల వరకు పెట్టుబడి పెట్టించుకునే వారని, ఆ తరువాత ప్రతి క్లిక్ కు 5 రూపాయలు సంపాదించొచ్చు అని చెప్పి వారిని బుట్టలో వేసేవారని వారు చెప్పారు. దీంతో సులువుగా బాధితులు వారి బుట్టలో పడేవారని పోలీసులు తెలిపారు. వారికి సంబంధించిన ఖాతాల్లో 500 కోట్ల రూపాయలు గుర్తించామని, ఆ ఖాతాలను సీజ్ చేశామని వారు చెప్పారు. నిందితులు తరచు కంపెనీ పేరు మారుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ సమర్ధవంతంగా వారిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని వారు ప్రకటించారు.