: గురి చూసి దెబ్బకొట్టిన మావోయిస్టులు... ఏవోబీలో మందుపాతర పేలుడు బీభత్సం
మల్కన్ గిరి ఎన్ కౌంటర్ కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. పోలీసులే లక్ష్యంగా ఏవోబీలో కల్వర్టు కింద బాంబు పెట్టిన మావోయిస్టులు వారిపై పంజా విసిరారు. సమయం చూసి పేల్చిన బాంబు దాడిలో 13 మంది పోలీసులతో ప్రయాణిస్తున్న టాటా మినీ వ్యాన్ సుమారు 25 అడుగుల ఎత్తు గాల్లోకి లేచిందని తెలుస్తోంది. ఈ వ్యాన్ కు సంబంధించిన శకలాలు 25 అడుగుల ఎత్తులో చెట్టుపై చిక్కుకోవడం చూస్తే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో వుందో ఊహించవచ్చు. వ్యాన్ లోని పోలీసుల దుస్తులు, ఆహారం చిందరవందరగా, చెల్లాచెదురుగా పడిపోయాయి. అమాంతం గాల్లోకి లేచిన వ్యాన్ ఓ చెట్టును ఢీ కొట్టి, దగ్గర్లోని లోయలో పడిపోయిందని సాక్షులు చెబుతున్నారు. దీంతో వ్యాన్ తునాతునకలైంది.
ఈ సందర్భంగా వ్యాన్ లో ఉన్న 13 మందిలో 11 మంది ఆచూకీ లభ్యం కాగా, మరో ఇద్దరు ఏమయ్యారన్నది అర్థం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు. అందరికీ తలలకు గాయాలు కాగా, వారిలో 8 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. దీంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కూంబింగ్ చేపట్టారు. మరి కొంత మంది పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇది జాతీయ రహదారి 21 కావడంతో రాకపోకలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, పేలుడు చీకటి పడిన తరువాత చోటుచేసుకోవడానికి తోడు సంఘటనా స్థలంలో భారీ గొయ్యి ఏర్పడడం, కల్వర్టు కూలిపోవడంతో సహాయకచర్యలకు అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక, రహదారి పునరుద్ధరణ చర్యలు చేపట్టామని వారు వెల్లడించారు.