: సామాన్యులకు, రైతులకు, యువతకు ఈ బడ్జెట్ ఏమాత్రం ఉపయోగపడదు: నితీశ్ కుమార్


సామాన్య ప్రజలకు, రైతులకు, యువతకు ఈ బడ్జెట్ తో ఏ మాత్రం ఉపయోగం లేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శించారు. పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం అభివృద్ధి చెందేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఈ బడ్జెట్ లో బీహార్ కు ఏమీ కేటాయించలేదని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం, ఎంత నల్లధనం వెనక్కి వచ్చిందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అనంతరం ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, గత ఏడాది ఎంతమంది ఉపాధి పొందారనే విషయాన్ని వెల్లడించలేదని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు యువతకు అందిస్తామని మోదీ వాగ్దానం చేశారని, అవేవీ అమలు కాలేదని అన్నారు. ఈ బడ్జెట్ తో పేద ప్రజలకు, రైతులకు, యువతకు ఎటువంటి ప్రయోజనమూ లేదన్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజ్ లు అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని లాలూ విమర్శించారు.

  • Loading...

More Telugu News