: ప్రియురాలే అతని ప్రాణం తీసింది.. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి పడేసింది!
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలే తన ప్రియుడి ప్రాణాలు తీసింది. జిల్లాలోని గొల్లపల్లెకు చెందిన శేఖర్ అనే వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యాడు. ఆయన మృతదేహం ఓ గోనెసంచిలో లభించింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన మైదుకూరు పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును ఛేదించి, ప్రియురాలే తండ్రితో కలసి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు వివరిస్తూ... ఆటోడ్రైవర్‌గా పనిచేస్తోన్న శేఖర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు. శేఖర్ బండివారిపల్లెలో నివాసం ఉంటున్న వివాహిత నీలి భారతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు.
భారతి తన భర్త రవికుమార్‌తో గొడవ పెట్టుకొని తల్లిగారింట్లోనే గత కొంత కాలంగా నివాసం ఉంటోందని, ఈ నేపథ్యంలో శేఖర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిందని తెలిపారు. తన ఇంటికి వస్తోన్న శేఖర్‌కు, భారతికి మధ్య ఇటీవల గొడవ జరిగిందని, అప్పటినుంచీ భారతిని వేధించడం మొదలు పెట్టాడని అన్నారు. శేఖర్‌పై భారతి గతంలో పోలీస్ కేసు పెట్టిందని, ఆయన జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలిపారు. అయితే, జైలు నుంచి తిరిగి వచ్చాక కూడా మళ్లీ భారతిని వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆగ్రహం తెచ్చుకుని, తన తండ్రితో కలిసి ఇంటికివచ్చిన శేఖర్‌ను రోకటితో కొట్టి చంపేసిందని చెప్పారు.
శేఖర్ మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి పట్టణంలోని మామిళ్లపల్లె వెళ్లే రహదారిలోని కల్వర్టులో పడేసి అనంతరం దానిపై యాసిడ్, పాటు పెట్రోల్ పోసి నిప్పు అంటించి వెళ్లిపోయారని పేర్కొన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు వచ్చిన పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా భారతి తన తండ్రి వెంకటరమణతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుందని చెప్పారు.