: కోర్టు ఆవరణలోనే వివాహితపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు.. కేకలు వేయడంతో పరార్
కోర్టు ఆవరణలోనే ఓ కానిస్టేబుల్ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భయంతో ఆమె కేకలు వేయడంతో సదరు పోలీసు అక్కడి నుంచి పరారయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గిరిజ అలియాస్ వనజ భర్త నుంచి వేరుగా ఉంటోంది. మనోవర్తి కేసు నిమిత్తం మంగళవారం నారాయణపేట కోర్టుకు వచ్చింది. మధ్యాహ్నం తిరిగి ఊరికి వెళ్తున్న సమయంలో కోర్టు మెట్ల కిందున్న ఖాళీ స్థలంలో ఊట్కూరు కోర్టు కానిస్టేబుల్ రామాంజనేయులు ఆమెను అడ్డుకుని బలవంతంగా మెట్ల కిందకు లాక్కెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ప్రవర్తనతో షాక్ కు గురైన గిరిజ తేరుకుని కేకలు వేయడంతో రామాంజనేయులు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ వెంటనే బాధితురాలు జడ్జి సాయికుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామాంజనేయులును ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.