: విదేశీయులకు ముచ్చెమటలు... అమెరికాలో వారికి మరిన్ని నిబంధనలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశంలోకి ప్రవేశించాలనుకుంటున్న విదేశీయులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. విదేశీ పౌరులపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా సన్నాహాలు చేసుకుంటోందని వైట్‌హౌస్ పాలసీ డైరెక్టర్ స్టీఫెన్ మిల్లర్ తెలిపారు. అమెరికాకి వచ్చే విదేశీయులు వారి ఫోన్ నంబర్లను, సామాజిక మాధ్యమాల వివరాలను, ఇంటర్నెట్లో వారు శోధించిన అంశాల గురించి తెలిపే బ్రౌజింగ్ హిస్టరీని తమకు అందజేయాలనే షరతులను విధించనున్నట్లు చెప్పారు.
విదేశీయులు ఒకవేళ ఈ సమాచారం ఇవ్వడానికి ఒప్పుకోకపోతే వారిని తమ దేశంలోకి అనుమతించబోమని తెలిపారు. దీనిపై చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే, విదేశీయులకు సంబంధించి ఈ అంశాలు సేకరించడం అన్యాయమని నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) మాజీ సీనియర్ లాయర్ ఆప్రిల్ దాస్ అన్నారు. ఈ చర్యలు వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని చెప్పారు.