: డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై న్యాయపోరాటం.. ఈ రోజు టెక్ దిగ్గజ కంపెనీల భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ఇచ్చిన ఎన్నికల హామీల అమలు దిశగా ముందుకు వెళుతూ.. ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులు, ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై టెక్ దిగ్గజ కంపెనీలు న్యాయపోరాటం దిశగా అడుగులు వేస్తున్నాయి. ట్రంప్ చర్యలపై చర్చించేందుకు ఈ రోజు గ్రూఫ్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీలు సమావేశం కానున్నాయి. ట్రంప్ ఆర్డర్ ఛాలెంజ్ చేస్తూ వేయబోయే దావాకు మద్దతుగా అమికస్ బ్రీఫ్స్ ను ఫైల్ చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగనున్నాయి.
ఆ దావాకు సపోర్ట్‌గా సమర్పించబోయే ఈ లీగల్ డాక్యుమెంట్ పై వారు సమగ్రంగా చర్చలు జరపనున్నారు. ఇందులో గూగుల్, ఎయిర్బీఎన్బీ ఇంక్, నెట్ ఫ్లిక్స్ ఇంక్ వంటి కంపెనీల ప్రతినిధులతో పాటు పలువురు పాల్గొననున్నారు. ట్రంప్ తీసుకున్న చర్యలు తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయని ఇప్పటికే పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.