: పోలీసుల అదుపులో ఖతర్నాక్ దొంగ గంగ మూడో భర్త.. భారీగా బంగారం స్వాధీనం!
విశాఖపట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 41 చోట్ల చోరీలకు పాల్పడి పోలీసులకు పట్టుబడిన యెండేటి గంగ మూడో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కంచరపాలెం బర్మాక్యాంపు ప్రాంతానికి చెందిన పాత నేరస్తురాలు గంగ గతంలోనూ అనేక దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభవించింది. జైలు నుంచి విడుదలైన అనంతరం నగరానికే చెందిన నరసింహారావు అలియాస్ శివను మూడో పెళ్లి చేసుకుని మకాంను రాజమండ్రికి మార్చింది. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు విశాఖ వస్తూ భర్తతో కలిసి 41 చోరీలకు పాల్పడి మూడు కేజీలకుపైగా బంగారం కాజేసింది.
తమ డిపార్టుమెంటుకు సవాలుగా మారిన గంగపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీస్ అధికారులు ఈనెల 25న ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమె నుంచి 497 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గంగ పోలీసులకు చిక్కినా భర్త నరసింహారావు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా నగరానికి వచ్చి వెళ్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్ తో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే నరసింహారావు అరెస్ట్‌ను పోలీసులు ఇప్పటి వరకు నిర్ధారించలేదు.