: ఏపీ ప్రజలకు తీపి కబురు.. అమరావతికి రైల్ కనెక్టివిటీ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు!
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రేపు (బుధవారం) ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి తీపి కబురు వినిపించనుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్ కనెక్టివిటీ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం పుష్కలంగా ఉన్నట్టు రైల్వే వర్గాల సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ఏడాదిలోపే పూర్తి చేసేలా లక్ష్యాన్ని కూడా నిర్దేశించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది రైల్వే బడ్జెట్‌లో మంజూరు చేసిన సర్వేని పూర్తి చేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. దీనిని అధ్యయనం చేసిన బోర్డు.. బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన కేటాయింపులు జరపాల్సిందిగా సూచించింది. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. రాజధానికి రైలు మార్గం వస్తే తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని గ్రామాల ప్రజలకు 30 కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లకు వెళ్లే బాధ తప్పుతుంది. 30 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రైలు మార్గ నిర్మాణ అంచనా వ్యయం రూ.200 కోట్లు.