: దక్షిణాది వారిపై ఉత్తరాది వారి పెత్తనం అంటూ వ్యాఖ్యలు చేయడం ఏంటి?: పవన్ కల్యాణ్ పై వెంకయ్య విమర్శలు
తమిళనాడులో జరిగిన జల్లికట్టు పోరాటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... టీడీపీ, బీజేపీ విడిపోవాలన్నదే ఇక్కడి ప్రతిపక్షాల వ్యూహమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారు రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడలేదని, అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకొని తన సత్తా గురించి ప్రశ్నించే ముందు సదరు నాయకులు నాడు వారి పత్తా (అడ్రస్సు) ఎక్కడుందో చెప్పాలని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. జల్లికట్టు ఆట సంవత్సరానికి రెండు మూడు రోజులు ఆడుకుంటారని, దానిపై పన్నీర్ సెల్వం ఢిల్లీకి వస్తే.. ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. అయితే, జల్లికట్టు విషయాన్ని ముడిపెట్టి దక్షిణాది వారిపై ఉత్తరాది వారి పెత్తనం అంటూ కొందరు పలు వ్యాఖ్యలు చేస్తున్నారని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు, నిధులు వస్తున్నాయని ఆ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని అన్నారు.