: గడువు ముగిశాక నెలరోజుల్లోనే జన్‌ధన్ ఖాతాల నుంచి రూ.5,582 కోట్ల నగదు ఉపసంహరణ!
పెద్ద నోట్ల డిపాజిట్ గడువు ముగిశాక నెల రోజుల్లోనే జన్‌ధన్ ఖాతాల నుంచి దేశవ్యాప్తంగా రూ.5,582 కోట్ల నగదు విత్ డ్రా అయినట్టు ఆర్థికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబరు 7వ తేదీ నాటికి జన్‌ధన్ ఖాతాల్లో రూ.74,610 కోట్లు ఉండగా జనవరి 11 నాటికి ఆ మొత్తం రూ.69,027.17 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు నెల రోజుల్లోనే ఏకంగా రూ.5,582 కోట్లు విత్‌డ్రా అయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 26.68 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ఉండగా వాటిలో గరిష్ట డిపాజిట్ పరిమితి రూ.50 వేలే. నోట్ల రద్దుకు ముందు అంటే గతేడాది నవంబరు నాటికి 25.5 కోట్ల ఖాతాల్లో రూ.45,636.61 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. సరిగ్గా నెల తర్వాత ఈ మొత్తం రూ.74,610 కోట్లకు చేరుకుంది. అంటే ప్రభుత్వం రద్దు చేసిన నోట్లు ఈ ఖాతాల్లో పెద్ద మొత్తంలో చేరాయన్నమాట. నోట్ల రద్దు తర్వాత దాదాపు 28,973 కోట్లు ఖాతాల్లో చేరినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.