: జగన్, పవన్ లు దున్నపోతులు: సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఏపీ కార్యదర్శి
వైకాపా అధినేత వైఎస్ జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు అధికారం కోసం పగటి కలలు కంటున్నారని ఏపీ బీజేపీ కార్యదర్శి వేమా అయ్యాజీ విమర్శించారు. కాకినాడలో నేడు మీడియాతో మాట్లాడిన ఆయన, వీరిద్దరూ దున్నపోతుల్లా తమ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని విమర్శిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్లు కళ్లులేని కబోదులని, వీరికి రాష్ట్రాభివృద్ధి కనిపించక పోవడం హాస్యాస్పదమని అన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్ మహిళల సాధికారతకు కృషి చేస్తోందని, ఎంతో మందికి వైద్య సహాయం చేస్తోందని ఈ కార్యక్రమాలన్నీ ప్రజాసేవలో భాగమేనని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని, అందుకు ప్రధానితో, ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెబుతున్న పవన్, గతంలో ఎన్నడైనా వారితో మాట్లాడారా? అని ప్రశ్నించారు.