: కర్ణాటక కాంగ్రెస్ కు షాక్...పార్టీని వీడిన మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం. కృష్ణ (84) పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఏర్పడిన విభేదాలు ఏకంగా ఆయనను పార్టీకి రాజీనామా చేసేలా పురికొల్పడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. కాగా, ఆయన 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004-2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా కూడా విధులు నిర్వర్తించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోని యూపీఏ గవర్నమెంట్ లో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఆయన కొనసాగారు. ఇంత విశేషమైన అనుభవం కలిగిన ఆయన పార్టీకి రాజీనామా చేయడం ఆసక్తి రేపుతోంది.