: 'ఎండు మిరపకాయలతో యాగం చేస్తా.. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తా' అంటూ హైదరాబాద్‌లో నకిలీ బాబా మోసాలు
21వ శతాబ్దంలోనూ మూఢ నమ్మకాల వల నుంచి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. వారి అమాయకత్వాన్ని, ఆశను ఆసరాగా తీసుకొని దొంగ బాబాలు వేలకు వేలు లాగేస్తున్నారు. ఈ క్రమంలో వైవీ శాస్త్రి అనే వ్యక్తి బాబా అవతారమెత్తి పలువురి నుంచి భారీగా డబ్బు తీసుకున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలను ఆరోగ్యవంతుల్ని చేస్తానని, పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం ప్రసాదిస్తానని చెబుతున్నాడు. అందుకోసం ఎండు మిరపకాయలతో హోమం నిర్వహిస్తానని పేర్కొన్నాడు.
అనారోగ్యంతో బాధ పడుతున్న తన ఆరోగ్యాన్ని బాగు చేస్తానని తన దగ్గరి నుంచి లక్షా యాభై వేల రూపాయిలు తీసుకుని ఆ నకిలీ బాబా మోసం చేశాడని హైదారాబాద్‌లోని వనస్థలిపురం పోలీసులకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు శాస్త్రిగారి కోసం గాలించి రామంతాపూర్‌లో అరెస్టు చేసి, రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మోసగాడిని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.