: బంగ్లాదేశ్ లో నిత్య పెళ్లికొడుకు: 28 పెళ్లిళ్లు.. 25వ భార్య కేసు...27వ భార్య ఇంట్లో అరెస్టు!
బంగ్లాదేశ్ లో ఓ 45 ఏళ్ల వ్యక్తి ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం 28 మందిని వివాహాలు చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. బంగ్లాదేశ్ లోని బర్గుణ జిల్లా తాల్కలి పట్టణానికి చెందిన యాసిన్ బైపారి (45) మోసాల తీరును వ్యతిరేకించిన అతని 25వ భార్య తానియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగని ఆమె తన భర్త పెళ్లి మోసాలపై పెద్ద పరిశోధనే చేసింది. ఈ క్రమంలో తన భర్త తన కంటే ముందు వివాహం చేసుకున్న 17 మంది యువతుల జాబితాను సేకరించి పోలీసులకు అందజేసింది. తనకు ముందు రెండే వివాహాలు జరిగాయని చెప్పి 2011లో వివాహం చేసుకున్నాడని, తమకు కుమార్తె పుట్టిన తరువాత కట్నం తేవాలంటూ వేధింపులకు దిగేవాడని తెలిపింది.
దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు యాసిన్ ను 27వ భార్య వద్ద అదుపులోకి తీసుకున్నారు. దీంతో 28వ భార్య కూడా వెలుగులోకి రావడం విశేషం. కాగా, దీంతో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు అతనిని హాజరు పర్చగా, రెండో భార్యకు ఇద్దరు కూతుళ్లు, మూడవ భార్యకు ఓ కుమారుడు, ఏడవ భార్యకు ఓ కొడుకు, 24వ భార్యకు ఓ కూతురు పుట్టారని, పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కాపురం చేశాక కట్నం కోసం వేధిస్తుంటాడని చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కు తానియా వివరాలు అందజేసింది. యాసిన్ బంగ్లాదేశ్ లోని మటిభంగా, చిట్టగాంగ్ ప్రాంతాలకు చెందిన యువతులను ఎక్కువగా పెళ్లాడాడని ఆమె వెల్లడించింది. దీంతో నిత్యపెళ్లికొడుకు అసలు రంగు, మోసాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.