: 'మనకు నచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకుందాం' అంటూ అసదుద్దీన్ ఒవైసీ పిలుపు!
జల్లికట్టు ఉద్యమం స్పూర్తిగా ట్రిపుల్ తలాక్ పై పెను ఉద్యమం చేద్దామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. తమిళుల్లా ముస్లింలంతా ఒక్కతాటి మీదకి వచ్చి ట్రిపుల్ తలాక్ కోసం పోరాడాలని ఆయన అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తమిళుల్లాగే తమకు కూడా సొంత సంస్కృతి ఉందని, తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునేందుకు ముస్లింలంతా నడుంబిగించాలని పిలుపునిచ్చారు. తమిళుల జల్లికట్టు ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా తల వంచాల్సి వచ్చిందని, అందుకే ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ముస్లింల పెళ్లిళ్లు, ట్రిపుల్ తలాక్ వంటి సంప్రదాయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉండేలా పోరాడాలని ఆయన సూచించారు.
తమ సంప్రదాయ క్రీడ కోసం లక్షలాది మంది తమిళ యువకులు నిరసనకు దిగారని, మనం వాళ్లకంటే ఎందులో తక్కువని ఆయన ప్రశ్నించారు. తమిళుల్లాగే మనకు కూడా మన సొంత సంస్కృతి ఉందని, మనకు నచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు ఇచ్చుకుంటామని, ఇలాగే చేయాలంటూ తమకు ఎవరూ చెప్పడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ ను పలు ముస్లిం మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం కూడా నడుస్తోంది. ఈ తరుణంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది.