: శశికళ సంచలన వ్యాఖ్యలు.. సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న 'చిన్నమ్మ'
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని, అప్పటి వరకు అటువైపు కన్నెత్తి కూడా చూడనని పార్టీ నేతల వద్ద తేల్చి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బాటలోనే తాను నడవాలనుకుంటున్నానని చెప్పినట్టు సమాచారం. అందుకనే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలతోపాటు, రిపబ్లిక్ వేడుకలకు కూడా ఆమె దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈనెల 23న తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శశికళ ఆరోజు అసెంబ్లీకి వస్తారని అంతా భావించారు. వీఐపీ గ్యాలరీలో కూర్చుని సమావేశాలను తిలకిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆమె హాజరుకాలేదు. ఈ విషయమై కొందరు సన్నిహిత శాసనసభ్యులు ఆమె వద్ద ప్రస్తావించగా తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానని చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం.