: హైదరాబాద్ లోనే జగన్ ను అరెస్ట్ చేయాలి: బొండా ఉమ
ప్రశాంతంగా ఉన్న విశాఖపట్టణాన్ని మరో తుని చేసేందుకు వైసీపీ అధినేత జగన్ కుట్ర పన్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకే ఆయన వైజాగ్ రావాలనుకుంటున్నారని... ఆయనను ఇక్కడకు రానివ్వకుండా, హైదరాబాద్ విమానాశ్రయంలోనే అరెస్ట్ చేయాలని అన్నారు. అమరావతిలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావుతో కలసి మీడియాతో మాట్లాడుతూ బొండా ఉమ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందకూడదనేది వైసీపీ ఆలోచన అని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదాకు సమానమైన లబ్ధి చేకూరేంత వరకు టీడీపీ ప్రభుత్వం రాజీపడబోదని... ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తించాలని చెప్పారు. జగన్ దుర్మార్గాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలని కోరారు. ఎన్నో ఉద్యోగాలను తీసుకొచ్చే ఇండస్ట్రియల్ సమ్మిట్ ను అడ్డుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ, కుట్ర పూరిత భావాలను కలిగిన జగన్ ను అరెస్ట్ చేయాలని అన్నారు.