: ఆర్కే బీచ్లో నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుంటాం.. పవన్ ట్వీట్లు ఆపితే మంచిది!: ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విశాఖ ఆర్కేబీచ్లో నేడు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ప్రకటించింది. జేఏసీ చైర్మన్ అడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చేస్తున్న ట్వీట్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటనే ఆపడం మంచిదని హితవు పలికారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను జైల్లో పెట్టినప్పుడు పవన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
గణతంత్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకానికి వందనం చేసి దేశభక్తిని చాటుకోవాల్సిన సమయంలో ప్రత్యేక హోదా కార్యక్రమంతో దేశాన్ని అవమానిస్తారా? అని నిలదీశారు. ఉద్యమం పేరుతో రాష్ట్రానికి అపఖ్యాతి తీసుకువస్తున్నారని విమర్శించారు. సీఐఐ సదస్సు ద్వారా వచ్చే రెండేళ్లలో రాష్ట్రానికి 2.25 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్టు కిషోర్ తెలిపారు. యువతను తప్పుదోవ పట్టించి వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని హితవు పలికారు.