: పవన్ ప్రతి ఉద్యమానికి ప్రభుత్వం స్పందిస్తోంది.. జగన్ రాజకీయ ఉగ్రవాది.. టీడీపీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి ఉద్యమానికి ప్రభుత్వం స్పందిస్తోందని టీడీపీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, వి. అనిత, కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. విశాఖపట్టణంలోని సర్క్యూట్‌హౌస్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన వారు పెట్టుబడిదారుల సదస్సు నిర్వహణ నేపథ్యంలో ఆర్కేబీచ్‌లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరసన తెలపడం సరికాదన్నారు. తాము ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదని, కానీ ఇప్పుడు మాత్రం దానికి సమయం కాదని సూచించారు.
గురువారం ఆర్కేబీచ్‌లో నిర్వహించనున్నకొవ్వొత్తుల ర్యాలీని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవన్ ప్రతి ఉద్యమానికి ప్రభుత్వం స్పందిస్తోందని, శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పవన్ కిడ్నీ బాధితులను పరామర్శించిన అనంతరం అక్కడ డయాలసిస్ పరిశోధన కేంద్రం, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న సమయంలో వైసీపీ చీఫ్ జగన్ రాజకీయ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు చేతనైతే ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని సవాలు విసిరారు. మోదీని కలిసి హోదాపై నిలదీయాలని సూచించారు. అంతేకానీ రాజకీయ దురుద్దేశంతో అభివృద్ధిని అడ్డుకోవద్దని నేతలు హితవు పలికారు.